ఇవాళ(మార్చి15).. డబ్ల్యూపీఎల్‌‌‌‌ ఫైనల్ ఫైట్

ఇవాళ(మార్చి15).. డబ్ల్యూపీఎల్‌‌‌‌ ఫైనల్ ఫైట్
  • తొలి టైటిల్ వేటలో ఢిల్లీ
  • రెండో ట్రోఫీపై ముంబై గురి
  • రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌, జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌

ముంబై:  హోరాహోరీగా సాగుతూ అభిమానులను అలరిస్తున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌) చివరి అంకానికి వచ్చింది. లీగ్ దశలో నువ్వానేనా అన్నట్టు తలపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌,  ముంబై ఇండియన్స్‌‌‌‌ శనివారం బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్ ఫైట్‌‌‌‌లో ఢీకొట్టనున్నాయి. లీగ్ టాపర్‌‌‌‌‌‌‌‌గా నేరుగా ఫైనల్ చేరుకున్న ఢిల్లీ తొలి టైటిల్‌‌‌‌పై గురిపెట్టింది. తొలి రెండు సీజన్లలోనూ తుదిపోరుకు వచ్చినా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ ఆ జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలని ఆశిస్తోంది.

ఇంకోవైపు ఆల్‌‌‌‌రౌండర్లతో అదరగొడుతున్న తొలి సీజన్ విన్నర్‌‌‌‌‌‌‌‌ ముంబై  రెండోసారి విజేతగా నిలవాలని కృతనిశ్చయంతో ఉంది. హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై టీమ్‌‌‌‌లో  సివర్ -బ్రంట్ (493 రన్స్‌‌‌‌, 9 వికెట్లు),  హేలీ మాథ్యూస్ (304 రన్స్‌‌‌‌, 17 వికెట్లు) బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. గురువారం గుజరాత్‌‌‌‌తో  జరిగిన ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌నూ ఈ ఇద్దరే జట్టును గెలిపించారు. అదే సమయంలో  లెగ్ స్పిన్నర్ అమెలియా కెర్ (16 వికెట్లు) కూడా సత్తా చాటుతోంది. ఆరంభంలో నిరాశపరిచినా.. కెప్టెన్‌‌‌‌ హర్మన్ కూడా ఫామ్ అందుకోవడంతో ముంబై దుర్బేధ్యంగా మారింది. పైగా సొంతగడ్డపై ఆడుతున్నందున ముంబైనే ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగనుంది. 

ఢిల్లీ తక్కువేం కాదు..

మెగ్ లానింగ్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా నిలకడగా ఆడుతూ నేరుగా ఫైనల్‌‌‌‌కు ప్రవేశించింది. టీమిండియాకు దూరమైన స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ (300 రన్స్‌‌‌‌) పవర్ ప్లేలో భారీ షాట్లతో విజృంభిస్తుండగా.. కెప్టెన్ లానింగ్(263 రన్స్‌‌‌‌)  కూడా   సత్తా చాటుతోంది. బౌలింగ్‌‌‌‌లో  జెస్ జొనాసెన్ (11 వికెట్లు), శిఖా పాండే (11 వికెట్లు)  ఆకట్టుకుంటున్నారు.

అండర్ 19 విన్నింగ్ టీమ్ కెప్టెన్ నిక్కి ప్రసాద్ కీలక సమయాల్లో బ్యాటింగ్‌‌‌‌లో రాణించడంతో ఢిల్లీ జట్టు బలోపేతం అయింది. అయితే కీలక ప్లేయర్లు జెమీమా, మరిజేన్ కాప్‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌ జట్టుకు ఇబ్బందిగా మారింది. ఫైనల్లో అయినా ఈ ఇద్దరూ రాణించాలని ఢిల్లీ కోరుకుంటోంది. లీగ్ దశలో తలపడ్డ రెండుసార్లు ముంబైపై ఢిల్లీదే పైచేయి కావడం విశేషం. అదే జోరుతో ముంబైని మరోసారి పడగొట్టి టైటిల్ నెగ్గాలని డీసీ పట్టుదలగా ఉంది.